పోలీసులు బానిసలుగా బతకొద్దు: చంద్రబాబు
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డం తగులుతున్నారు. గుడిపల్లిలోని పార్టీ కార్యాలయానికి కూడా వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డగించారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. వారి వైఖరిపై నిరసనగా స్థానిక బస్టాండ్ సమీపంలోని రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్పై ఫైర్ అయ్యారు. సీఎం సభ పెట్టలేదా? ఆయనకో రూలు.. నాకో రూలా? అని ప్రశ్నించారు. ఇతర ప్రాంతాల ప్రజలు గుడిపల్లికి రాకుండా మూడు మార్గాల్లో అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం పోలీసులపై ధ్వజమెత్తారు. పోలీసులు బానిసలుగా బతకొద్దని సూచించారు. ‘‘పోలీసులూ.. ఏంటీ బానిసత్వం. మీరు రక్షణ కల్పించే వారు. బానిసలుగా బతకొద్దు. చట్టం మీకిచ్చిన విధులను నిర్వర్తించండి. ఇక్కడి నుంచి నన్ను వెనక్కి పంపాలని ప్రయత్నిస్తున్నారు. కానీ నేను ఎట్టిపరిస్థితుల్లో వెళ్లను. మిమల్నే పంపిస్తాను. మిమ్మల్నే కాదు.. సైకో సీఎం, ఆయన పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేసే వరకు పోరాడతా. నా గొంతు 5కోట్ల మంది ప్రజలది. ఈ విషయాన్ని సీఎం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి అరాచకాలకు తావులేదు’’ అని చంద్రబాబు అన్నారు.













