పల్నాడు ఉద్రిక్తతకు చంద్రబాబే కారణం..అంబటి రాంబాబు..
ఆంధ్రాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగిన రోజు..ఆ మరుసటి రోజు పలు ప్రాంతాలలో ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా పల్నాడు ప్రాంతం హింసాత్మక ఘటనలతో సర్వత్రా చర్చనీయాంసంగా మారింది. దీనిపై ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా స్పందించింది. పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల గురించి విచారణ జరుపుతున్న సిట్ బృందాన్ని మంత్రి అంబటి రాంబాబు కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన పలు అంశాలను వివరించడంతో పాటు.. ప్రతిపక్ష నేతల తీరుపై కూడా ఫిర్యాదు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి.. పోలింగ్ రోజున పోలీసుల యంత్రాంగం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు. ఎన్నికలలో ఓడిపోతాం అనే భయంతో చంద్రబాబు ఆంధ్రాలో హింసను ప్రోత్సహించారని అంబటి పేర్కొన్నారు. పోలింగ్ సందర్భంలో.. ఆ తరువాత జరిగిన దాడుల వెనక చంద్రబాబు, పవన్, పురందరేశ్వరి ఉన్నారు అన్న అనుమానాన్ని అంబటి వ్యక్తం చేశారు. సత్తనపల్లి నియోజకవర్గం నుంచి తాను మూడుసార్లు బరిలోకి దిగాను అని చెప్పిన అంబటి.. ఇప్పటివరకు ఎన్నడూ అక్కడ హింసాత్మకమైన సంఘటనలు చూడలేదని పేర్కొన్నారు. పల్నాడు, తాడిపత్రి.. ఇలా అధికారులను మార్చిన చోట మాత్రమే హింస చెలరేగింది అని అంబటి అన్నారు. ఈవీఎంలు పగల గొట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ దాడులకు పాల్పడ్డారని.. ఎక్కడైతే పురందరేశ్వరి ఫిర్యాదుతో అధికారులను మార్పించారో ..అక్కడే హింస జరిగిందని ఆరోపించారు. జరుగుతున్న పరిస్థితుల రీత్యా.. కూటమి నేతలు కావాలని కుట్రలు చేశారు అన్న విషయం అర్థం అవుతోంది అని అంబటి తెలిపారు.
అంతేకాదు సత్తనపల్లి నియోజకవర్గంలో కూటమి నేతలు పోలింగ్ బూత్ లలో దొంగ ఓట్లు కూడా వేయించారని మండిపడ్డారు. హింసాత్మక సంఘటనల సందర్భంగా తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిట్ అధికారులను తాను కోరినట్లు అంబటి వెల్లడించారు. కొండాపిలిలో కూటమినేతలకు భయపడి ముస్లింలు ఇల్లు వదిలి పారిపోయారని.. గ్రామాలు విడిచి వెళ్లిన వారిని తిరిగి రప్పించాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందని అంబటి పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని పన్నాగాలు పన్నినా.. గెలుపు జగన్ కే దక్కుతుందని అంబటి ధీమా వ్యక్తం చేశారు.













