ఆయన రాజకీయాల్లోకి రావాలి : చంద్రబాబు
సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఏపీఎన్జీఓ నేత అశోక్ బాబు రాజకీయాల్లోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. సమైక్యాంధ్ర ఉద్యమ వేదికగా పేరొందిన విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నిర్వహించిన నవనిర్మాణ దీక్ష వేదికపైనే ముఖ్యమంత్రి ఈ ఆహ్వానం పలికారు. వచ్చే ఏడాది ఆయన పదవీ విరమణ చేయనున్నారని, ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి రావాలంటూ ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యోగులు చేసిన పోరాటం ఎవరూ మరువలేరని, అదే నిబద్ధతతో ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని అశోక్ బాబుకు సూచించారు. ఆయన ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉంటామంటూ పరోక్షంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.













