DINC: కుప్పం లో డీఐఎన్సీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆరోగ్య ఆంధ్ర కల సాకారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం (Kuppam Constituency) నుంచే తొలి అడుగు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం, టాటా సంస్థ (Tata company) సహకారంతో కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ నెర్వ్ కేంద్రాన్ని ( డీఐఎన్సీ) సీఎం ప్రారంభించారు. డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఏరియా ఆసుపత్రి -13 పీహెచ్సీలు, 92 విలేజ్ హెల్త్ సెంటర్లు అనుసంధానం చేశారు. వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా ఈ కేంద్రం సేవలందించనుంది. దీని ద్వారా వర్చువల్ విధానంలో రోగికి వైద్య నిపుణుల్ని అందుబాటులోకి తీసుకొచ్చి చికిత్స అందించే వెసులుబాటు కలుగుతుంది. ప్రజారోగ్యానికి సంబంధించి అన్ని వివరాలు ఒక్క చోట చేర్చేలా డిజి నెర్వ్ ఏర్పాటు చేశారు.













