Chandra Babu: చంద్రబాబు ను ఇరకాటంలో పెడుతున్న సూపర్ సిక్స్..
2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి సూపర్ సిక్స్(Super six) పథకాలు ముఖ్య పాత్ర పోషించాయి.ఏపీలో టీడీపీ (TDP) కూటమి అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే కొన్ని హామీలు అమలు చేసినా, కీలకమైన సూపర్ సిక్స్ హామీల విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రావడం లేదు. సామాజిక పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ (Free gas) పథకాల అమలు జరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే మరింత ప్రాధాన్యం కలిగిన హామీలు ఇంకా నిలిచిపోయాయి.
విపక్షాలు ఈ విషయాన్ని కేంద్రంగా చేసుకుని విమర్శలు చేస్తూ ప్రజల్లో చర్చకు తీసుకొస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు వట్టి మాటలే అంటూ..ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అమలు కాలేదని విమర్శిస్తున్నారు. ఈ విమర్శలు చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ముఖ్యమైన హామీల్లో ఒకటైన “తల్లికి వందనం” పథకంపై మరింత ఆసక్తి నెలకొంది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ప్రతి ఇంట్లో ఉన్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ పథకం అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీ కూడా మహిళలలో భారీ అంచనాలు పెంచింది.
రైతులకు “అన్నదాత సుఖీభవ” పథకం, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 అందించడం, నిరుద్యోగులకు మూడు వేల రూపాయల భృతి వంటి హామీలు కూడా అమలుకావాల్సి ఉంది. అయితే విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో “తల్లికి వందనం” పథకం అమలు గురించి చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకంపై కూడా చాలా మంది మహిళలు ఆశలు పెట్టుకున్నారు.
ఇవన్నీ సంక్షేమానికి సంబంధించిన హామీలు కావడంతో ప్రభుత్వం ఈ నెల 17న జరిగే మంత్రి వర్గ సమావేశంలో వీటి గురించి నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆశా ఉన్నా, గతంలో జరిగిన సమావేశాలు వీటి గురించి చర్చించకుండానే ముగియడంతో.. ఈసారి నిజంగా ప్రణాళికలు అమలులోకి వస్తాయా లేదా అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు ఈ పథకాల అమలు కోసం పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సి రావడం, సిబ్బంది అవసరం, ఆటో డ్రైవర్ల ఉపాధి మీద ప్రభావం వంటి సమస్యలు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అలాగే “తల్లికి వందనం” కోసం పెద్ద మొత్తంలో బడ్జెట్ అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు.
మహిళలకు ఆర్థిక, సామాజిక ప్రయోజనం కలిగేలా రూపొందించిన ఈ పథకాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటేనే ప్రజల్లో మంచి విశ్వాసం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కూటమికి ప్లస్ అయిన ఈ పథకాలు కాలం గడుస్తున్న కొద్ది మైనస్ గా మారేలా ఉంది. మరి దీనిపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.













