ఉగ్రవాదులను మించిన పాలన వైసీపీది : చంద్రబాబు
రాక్షసులు, ఉగ్రవాదులను మించిన పాలన వైసీపీది అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీకి చెందిన రాయలసీమ ప్రాంత జిల్లాల సర్పంచ్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ హక్కుల కోసం వారు చేసే పోరాటానికి టీడీపీ మద్దతిస్తుందని అన్నారు. గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అన్నారు. వైసీపీ ప్రభుత్వం సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని మండిపడ్డారు. సర్పంచ్లకు రాజ్యాంగం హక్కులు కల్పించిందన్నారు. రాజ్యాంగ హక్కులను జగన్ హరిస్తున్నారు. సర్పంచుల అధికారాలను తీసుకోవడానికి ఆయన ఎవరు? ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అరాచకాలు చోటు చేసుకున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఎవరు పోటీ చేయోద్దని వైసీపీ హుకుం జారీ చేసింది, ఎన్నికల్లో ప్రచారం కూడా చేయనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా టీడీపీ తరపున బరిలో దిగి పోరాడి గెలిచారు అని అన్నారు.













