మాచర్లలో జరిగిన ఘటన ప్రభుత్వానికి కనబడలేదా? : చంద్రబాబు
రాష్ట్రంలో వైకాపా కార్యకర్తల దౌర్జన్యాలు, అరాచకాలు శృతి మించిపోయాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమా, హైకోర్టు న్యాయవాది కిశోర్ ప్రయాణిస్తున్న వాహనంపై వైకాపా కార్యకర్తల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. వాళ్లను వెంబడించి చంపేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా అరాచకాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం ఉన్నాయా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదని విమర్శించారు. బుద్దా వెంకన్న, బొండా ఉమకు రక్షణగా ఉన్న పోలీసు వాహనంపైనా వైకాపా కార్యకర్తలు దాడి చేశారని, ఇంత జరిగినా పోలీసులకు బాధ లేదా? అని ప్రశ్నించారు.
మాచర్లలో జరిగిన ఘటన ప్రభుత్వానికి కనబడలేదా? ఏంటీ రాజకీయాలు? గత 40 ఏళ్లలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? డీజీపీ ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. ఆయన ఏం సమాధానం చెబుతారు? ఇంత జరిగినా చీమకుట్టినట్లైనా లేదు? బుద్దా వెంకన్న, బొండా ఉమపై హత్యాయత్నం జరిగితే ఏం చేస్తున్నారు. చంపేస్తారా? చంపండి. తమషా ఆటలు ఆడుతున్నారు. ఎప్పుడైనా ఏ నియోజకవర్గంలోనైనా ఇలా జరిగిందా? ఇంతా అరాచకాలేంటి? కట్టడి చేయాల్సిన బాధ్యత లేదా? కట్టడి చేయలేకపోతే వ్యవస్థ ఎందుకు? ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి లేదా? ఓటు వేసే హక్కు లేదా? కశ్మీర్, బిహర్లోనూ ఇలా జరగలేదు అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోందని ఆరోపించారు. దేనికైనా ఒక హద్దు ఉంటుందని ఆ హద్దులన్నింటినీ వైకాపా నేతలు అతిక్రమించారని విమర్శించారు. ప్రజలే ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. చేతులు జోడించి అడుగుతున్నా.. ఆలోచించుకోండి. మేం కూడా పోరాడతాం. వైకాపా అరాచకాలను అడ్డుకోవడం మా ఒక్కరితోనే సాధ్యం కాదు. నియంత పాలన అడ్డుకోలేమా? బాధ, ఆవేదన కలుగుతోంది. రాష్ట్రాన్ని శాశ్వతంగా తాకట్టు పెట్టుకుంటారా? మీరే నిర్ణయించుకోవాలి. మీకు బాధ్యత ఉంది. మీరూ పోరాడాలి అని ప్రజలను చంద్రబాబు కోరారు.













