వైసీపీ ప్రభుత్వం అసమర్థత వల్ల పెరుగుతున్న నేరాలు: చంద్రబాబు
వైసీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్‌లో విపరీతంగా నేరాలు పెరిగిపోయాయని, రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో బాపట్ల జిల్లాలో బాలుడి సజీవ దహనం తదితర అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. ‘సీఎం, ప్రభుత్వ అసమర్థత వల్లనే రాష్ట్రంలో నేరాలు ఈ రకంగా పెరిగిపోతున్నాయి. సీఎం వైఖరి పూర్తిగా నేరస్థులకు ఊతమిస్తున్నట్లే ఉంది. మహిళలకు రాష్ట్రంలో భద్రత లేదు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. బిల్లులు రాక గుత్తేదారులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంజాయి, గన్ కల్చర్ పెరిగిపోతోంది. కష్టపడి ఆస్తులు సంపాదించుకుంటే వైసీపీ లీడర్లు వాటిని కబ్జా చేస్తున్నారు. విశాఖలో ఎంపీని కిడ్నాప్ చేశారంటేనే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు’ అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.













