చెత్త మీద పన్ను వేసే చెత్త ముఖ్యమంత్రి: చంద్రబాబు
కర్నూలు పర్యటనలో భాగంగా ఆదోనిలో భారీ రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు నాయుడు.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు. అనంతరం రాష్ట్రంలో విధిస్తున్న పన్నులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో చెత్త మీద పన్నును వేయడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. ‘చెత్తమీద పన్ను వేసే చెత్త ముఖ్యమంత్రిని ఏమనాలి?’ అని ప్రశ్నించారు. ‘రేపు మనం మరుగుదొడ్లు కట్టిస్తే వాటిపైన కూడా ఈ ప్రభుత్వం పన్ను వేస్తుంది. రాష్ట్రంలో ఇసుక దొరుకుతుందా?.. ఇక్కడి ఇసుక కర్ణాటక, హైదరాబాద్‌లకు వెళ్తోంది. రాష్ట్రంలో మద్యం మాఫియాతో రాష్ట్రాన్ని జగన్ దోచుకుంటున్నారు. తయారీ ఆయనే అమ్మకం కూడా ఆయనే చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో హవాలా మంత్రి.. కర్నూలులో బెంజి మంత్రి. ఇదీ జగన్ క్యాబినెట్’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యం, ఇసుకపైన వస్తున్న డబ్బు ప్రభుత్వానికి చాలడం లేదని, అందుకే నకిలీ విత్తనాలతో అన్నం పెట్టే రైతులను కూడా ముంచేశారని అన్నారు. ఆనాడు తప్పు చేస్తే తాటతీస్తామన్న భయం ఉండబట్టే అందరూ అక్రమం చేసేందుకు భయపడ్డారని, కానీ నేడు ప్రభుత్వమే అక్రమాలు చేస్తూ నేతలూ అక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారని, వైసీపీ నేతలు రాష్ట్ర ఖనిజ సంపదను దోచుకుంటున్నారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి రోజు నిద్రలేవగానే ప్రజలు తమ భూములు ఉన్నాయా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.













