ఉంటే ఉండండి.. పోతే పోండి.. నానిపై చంద్రబాబు ఫైర్
టీడీపీపై విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఓ కంపెనీ అని, దాని ఓనర్ మీరని, మీకు నచ్చినట్లు పార్టీని నడుపుకోండంటూ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ‘నా కంపెనీకి నేను ఓనర్ని, నాకు నచ్చినప్పుడు వెళ్తాను. మీ వారసత్వంలో పనిచేయలేం’ అని అన్నారు. దీంతో టీడీపీ నేతలంతా షాక్ తిన్నారు. కొద్ది సేపటి తర్వాత షాక్ నుంచి తేరుకున్న చంద్రబాబు.. విజయవాడ ఎంపీ కేశినేనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఇష్టం ఉన్నవాళ్లు ఉండండి, పోయేవారు పోండి’ అంటూ చంద్రబాబు ఘాటుగా స్పందించడంతో పార్టీ నేతలు మౌనం పాటించారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా జిల్లా ప్రజాప్రతినిధులు, ఎంపీ కేశినేని సహా పలువురు నేతలతో మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ‘జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమీ బాగాలేదని, అంతర్గత కుమ్ములాటలతో పార్టీ నష్టం వాటిల్లుతుందని, ఎంత చెప్పినా మీలో మార్పు రావట్లేదు’ అని చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీంతో కేశినేని ఆగ్రహించారు. తనను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా వల్ల పార్టీలో ఎటువంటి సమస్య లేదు. నేనెవరితో గొడవలు పడటం లేదు. ఎవరెవరికీ గొడవలు పెట్టడం లేదు. ఈ పార్మీ మీ కంపెనీ, మీకు నచ్చినట్లు నడుస్తుంది. కానీ కేశినేని కంపెనీకి నేను యజమానిని. నా కంపెనీ నాకు ఇష్టం వచ్చినట్లు నడుస్తుంది. మీ పార్టీలో మీరు చెప్పింది నడుస్తోంది. తర్వాత మా వారసుల హవా నడుస్తుంది’ అంటూ కేశినేని అన్నారు.













