ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు..!!
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 7వ తేదీ జగన్ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. తాను ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే కేబినెట్ సమావేశానికి ప్రకటన రావడంతో ఏదో జరగబోతోందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముందస్తుకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. అందుకే కేబినెట్ లో ఈ విషయంపై చర్చిస్తారని పలువురు భావిస్తున్నారు. దీంతో ప్రతిపక్ష టీడీపీ అప్రమత్తమైంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని టీడీపీ చాలాకాలం నుంచే చెప్తోంది. ఇప్పుడా సమయం వచ్చిందని భావిస్తోంది. అందులో భాగంగా ఎన్నికలకు ప్రిపేర్ అవుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారాయన. అంతేకాక, గతానికి భిన్నంగా అభ్యర్థులను కూడా ఖరారు చేసేస్తున్నారు. నేతల మధ్య పోటీ లేని నియోజకవర్గాల్లో క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారు. దీంతో వాళ్లు ఇప్పటినుంచే ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు వీలవుతుంది. సాధారణంగా తెలుగుదేశం పార్టీ చివరి నిమిషం వరకూ అభ్యర్థులను ఖరారు చేయకుండా నాన్చుతూ ఉంటుంది. రేపు నామినేషన్లు ముగుస్తాయంటే ముందురోజు రాత్రి ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ దఫా అలాంటి ప్రయోగాలకు పోకుండా వీలైనంత వరకూ ముందే అభ్యర్థులను ఫైనల్ చేసేస్తోంది.
తాజాగా చంద్రబాబు నాయుడు ఐదు నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. పాలకొల్లు, అవనిగడ్డ, విజయవాడ సెంట్రల్, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పరిస్థితిపై స్థానిక నేతలతో చర్చించారు. పాలకొల్లుకు సంబంధించి నిమ్మల రామానాయుడు, అవినిగడ్డకు మండలి బుద్ధప్రసాద్, విజయవాడ సెంట్రల్ నుంచి బొండా ఉమామహేశ్వర రావు, నందిగామ నుంచి తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట నుంచి శ్రీరాం తాతయ్య హాజరయ్యారు. నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఆరా తీసి.. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. మీరే అభ్యర్థులను, కాబట్టి గెలుపుకోసం గట్టిగా కృషి చేయాలని ఆదేశించారు.
వాస్తవానికి ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం జరుగుతుండడంతో టీడీపీ కూడా అందుకు అనుగుణంగా సిద్ధమవుతోంది. ముందే అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా వారికి వీలైనంత సమయం దొరుకుతుందని, ప్రజల్లోకి వెళ్లేందుకు వీలవుతుందని భావిస్తోంది. తాజాగా నేతల సమీక్షలో కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. నేతలంతా ఇకపై పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని, ఏమాత్రం అలసత్వం వహించినా టికెట్ వేరే వాళ్లకు ఇచ్చేందుకు వెనుకాడబోనని హెచ్చరించారు. మహిళా ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. గతానికి భిన్నంగా చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ గట్టిగానే హెచ్చరిస్తుండడంతో నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. చావోరేవో అన్నట్టు చంద్రబాబు టీంను సిద్ధం చేస్తున్నారని నేతలు చెప్తున్నారు.













