ఇది పాదయాత్ర కాదు.. రాష్ట్ర పరిక్షణ కోసం చేస్తున్న యాత్ర
అమరావతి పరిరక్షణ కోసం రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంఫీుభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది పాదయాత్ర కాదని, రాష్ట్ర పరిరక్షణ కోసం చేస్తున్న యాత్ర అని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం భూములను త్యాగం చేసిన పుడవి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని తెలిపారు. అవమానాలెదురైనా ఆశయ సాధన కోసం పోరాడుతూనే ఉన్నారన్నారు. అమరావతి ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. మహాపాదయాత్ర ద్వారానైనా పాలకులకు కనువిప్పు కలగాలని అన్నారు. ప్రతీకారాలు, కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభజన జరిగినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందన్నారు. ఎప్పుడూ ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించి ముందుచూపుతో నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఉహించలేమని అన్నారు. అమరావతిని కాపాడుకోకపోతే రాష్ట్రం అందకారమవుతుందని అన్నారు. పాదయాత్రకు ప్రజలు, వివిధ సంఘాలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.













