మోదీ భయమంతా అదే : చంద్రబాబు
ఈ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ ఇంటికి పోవడం ఖాయం.. ఏపీకి న్యాయం జరగడం ఖాయమని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కుంభకోణాల్లో మునిగి తేలినవారిని మోదీ రక్షిస్తారని.. ఈ ఎన్నికల తర్వాత ఆయనను గుజరాత్ పంపించడం ఖాయమన్నారు. ఆదివారం రాత్రి విశాఖ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా విభజనతో నష్టపోయిన ఏపీ పట్ల మోదీ వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్ల క్రితం మోదీ ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాయం చేస్తానని మోసం చేశారన్నారు. హుద్‌హుద్ సాయం రూ.1000 కోట్లు ఇస్తానని చెప్పి కేవలం రూ.650 కోట్లే ఇచ్చారన్నారు. నామమాత్రంగానే విశాఖ రైల్వేజోన్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ విమానాశ్రయం అభివృద్ధిని అడ్డుకున్నారని, భోగాపురం విమానాశ్రయాన్ని కూడా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ ఎయిర్‌షోను కూడా చివరి నిమిషంలో మోదీ రద్దుచేశారని ధ్వజమెత్తారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి మళ్లీ తీసుకున్న నీచ మనస్తత్వం మోదీదన్నారు. రాష్ట్రంలో భాజపాకు ఒక్కరైనా ఓటేస్తారా? రాష్ట్రంలో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అందుకే కాంగ్రెస్‌తో కలిశాం
‘‘ మోదీ దయాదాక్షిణ్యాలపై మేం ఆధారపడలేదు. అహ్మదాబాద్ కంటే విశాఖ ముందుకెళ్తుందని మోదీ భయం. మోదీ మనసు నుండి అసూయ, విద్వేషం. ఆయన చెప్పేది చెయ్యరు.. చేసేది చెప్పరు. పింఛను మొత్తాన్ని రూ.3వేలకు పెంచుతాం. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పింది మనమే. జాబు రావాలంటే మళ్లీ మళ్లీ బాబు రావాలి. కోడికత్తి పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయా? విశాఖలో మరోసారి విజయమ్మ ఎందుకు పోటీ చేయడంలేదు. వైకాపా రౌడీలను చూసి ప్రజలు భయపడి ఓడించి పంపారు. విశాఖను ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తయారు చేస్తాం. నాలెడ్జ్ హబ్‌గా తయారు చేస్తాం. గాజువాకలో వైకాపా నేతలు రౌడీయిజం చేశారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని పూర్తిగా అరికట్టా. విశాఖలో భూగర్భ విద్యుత్ కేబుళ్లు వేస్తున్నాం. సింహాచలంలో ఉన్న 12వేల మందికి పట్టాలు ఇచ్చాం. గ్రామాలు, పట్టణాల్లో ఉచితంగా ఇళ్లు నిర్మిస్తాం. విశాఖను దేశంలోనే నంబర్ వన్ గ్రోయింగ్ సిటీగా చేస్తాం. ఏపీకి రూ.75 వేలకోట్లు రావాలని జనసేన గతంలో చెప్పింది. వారు మరోసారి ఎందుకు నోరు విప్పలేదు? ఒకరిద్దరు చెప్పే మోసపు మాటలను ప్రజలు వినవద్దు. రాష్ట్రంలోని డ్రైవర్లందరికీ నేనే నంబర్ వన్ డ్రైవర్ని. ప్రజలు దేశ రాజకీయాలను అర్థం చేసుకోవాలి. ప్రత్యేక హోదాను విభజన చట్టంలో పెడితే మాకు ఈ సమస్యలు తప్పేవి. హోదా ఇస్తామన్నారనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో కలిశాం. బీచ్ రోడ్లు, పోర్టులు వస్తే ఏపీకి ఆదాయం పెరుగుతుంది. విశాఖను లాజిస్టిక్ హబ్గామారుస్తాం. దేశంలో ఎందరో నాయకులు ఉన్నారు. మోదీ కంటే గొప్ప నేతలు ఉన్నారు. దిల్లీకి రాష్ట్ర హోదా రావాలి. కేజ్రీవాల్‌కు అండగా నిలుస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.













