పవన్ అంటే ఎందుకంత భయం: చంద్రబాబు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై టీడీపీ అధినేత స్పందించారు. వైసీపీ నేతలు అసలెందుకు పవన్‌ను అంతలా తిడుతున్నారని ప్రశ్నించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన సభలో వైసీపీ నేతలపై పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. సంక్రాంతి వేడుకల కోసం నారావారిపల్లెకు వెళ్లిన చంద్రబాబు అక్కడ మీడియాతో మాట్లాడారు. శ్రీకాకుళం సభలో వపన్ తాను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పారని చంద్రబాబు అన్నారు. ‘‘వైసీపీ నేతలు పవన్‌ను ఎందుకు తిడుతున్నారు. పవన్ అంటే వారికెందుకంత భయం. వైసీపీ నేతలకు ఎందుకంత పిరికితనం’’ అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారంతో వచ్చిన అహంకారం మంచిది కాదని వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు సరైన బుద్ధి చెబుతారంటూ చంద్రబాబు పేర్కొన్నారు.













