పృథ్వీరాజ్ మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారం
అమెరికాలోని సిన్సినాటీలో జరిగిన కాల్పుల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్వీరాజ్ మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. పృథ్వీరాజ్ కుటుంబం సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలిపారు. ఇటీవల కాలంలో తెలుగువారు ఎక్కువగా ఇటువంటి ఘటనలకు గురికావడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పృథ్వీరాజ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పృథ్వీరాజ్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఉత్పన్నం కాకుండా చూసేలా అమెరికా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులను కోరారు.













