మహిళా పోలీసును ఈడ్చుకెళ్లడాన్ని ఎలా సమర్థించుకుంటారు ? : చంద్రబాబు
అనంతపురం నగరంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) స్టేషన్లో వైసీపీకి చెందిన ఓ కార్పొరేటర్ వీరంగం సృష్టించడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. మహిళా పోలీసుల దుస్తులు లాగుతూ ఈడ్చుకెళ్లడాన్ని పోలీసు పెద్దలు, పాలకులు ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులకు కూడా రక్షణ లేని అరాచక పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. దాడిలో వైసీపీ కార్యకర్తలతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నేరస్థుడికి అధికారం ఇచ్చినందుకు ప్రజలు భయం భయంగా బతకాల్సి వస్తోందన్నారు.













