టీడీపీ అధికారంలోకి వచ్చాక… కొత్త జిల్లాలను : చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలు సరిదిద్దుతామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని అరోపించారు. ముఖ్యమంత్రి అవలంబిస్తోన్న విధానాల వల్ల రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ఉన్నతాధికారుల వ్యాఖ్యలు రాష్ట్ర పరిస్థితికి అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్, పన్నుల భారంపై బాదుడే బాదుడు పేరుతో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని చేపడతామని పేర్కొన్నారు. కరెంట్ ఎందుకు పోతోందో, బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే ప్రజలపై తీవ్ర భారం వేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతిలో 80 శాతం పూర్తయిన పనులను కూడా జగన్ పూర్తి చేయలేకపోయారని అసహనం వ్యక్తం చేశారు. జగన్ పాలనపై ఆయన సొంత నియోజకవర్గం కూడా సంతృప్తిగా లేదని అన్నారు. వ్యక్తిగత అవసరాల కోసమే పదవులు ఇస్తున్నారని అన్నారు. జగన్‌కు ఓటేసి తప్పు చేశామనే భావన ఇపుడు సొంత వర్గంలోనే ఉందని తెలిపారు. సీపీఎస్ రద్దు విషయంలో ఆందోళనలు చేస్తున్న వారికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. అక్రమ మద్య రవాణా ద్వారా జగన్ రూ.వేల కోట్లు ఆర్జిస్తున్నారని, ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే నాసికరం మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం, జె`ట్యాక్స్‌పై పోరాటం కొనసాగించాలని అన్నారు.













