మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
రాజధానిగా అమరావతే కొనసాగాలని రైతుల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో గ్రహించి, మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం వంద రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ ద్వారా స్పందించారు. వంద రోజులుగా అడుగడుగునా నిర్బంధాలు, పోలీసు కేసులు, వేధింపుల, అవమానాల నడమ అమరావతి రైతుల ఆందోళన కొనసాగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అమరావతి రైతులు ఆందోళన కొనసాగుతూనే ఉందన్నారు. రైతులు, మహిళలు, రైతు కూలీలు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉద్యమం కొనసాగిస్తున్నారన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, మిలటరీ వాళ్ల కోసం దేశం అండగా నిలిచినట్టుగానే.. రాష్ట్ర రాజధాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష కొనసాగిస్తున్న ఉద్యమకారులను సమాజం గుర్తించాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో స్పందించి మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.













