అమిత్ షాతో మరోసారి భేటీ కాబోతున్న చంద్రబాబు..!
ఇటీవల హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. బీజేపీని ద్వేషించి బయటకు వచ్చి ఘోర పరాజయం పాలైన చంద్రబాబు.. చాలా కాలంగా కమలం పార్టీతో స్నేహం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబు పేరెత్తితే కూడా సహించలేని పరిస్థితిలో బీజేపీ ఉండేది. కానీ ఇప్పుడు అనూహ్యంగా అమిత్ షాయే చంద్రబాబు నాయుడికి ఆహ్వానం పంపడం, దాదాపు గంటసేపు రహస్య మంతనాలు జరపడం ఆశ్చర్యం కలిగించింది. అసలేం జరుగుతోందని తెలుగు పార్టీలు ఆరా తీయడం మొదలు పెట్టాయి.
బీజేపీ – తెలుగుదేశం పార్టీల మధ్య స్నేహం, పొత్తుల గురించి తెలుగు వారందరికీ సుపరిచితమే. ఆ రెండు పార్టీలు ఎప్పుడెప్పుడు కలిశాయి.. ఎప్పుడు విడిపోయాయి.. ఏ సందర్భంలో విడిపోయాయి.. ఆ తర్వాత పరిస్థితులేంటి.. అనే విషయాలు అందరికి తెలుసు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత చంద్రబాబు నాయుడుకు తత్వం బోధపడింది. బీజేపీని వదిలేసి తాను పెద్ద తప్పు చేశానని తెలుసుకున్నారు. అప్పటి నుంచి బీజేపీతో స్నేహం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అటు వైపు నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబు ప్రయత్నిస్తూనే వచ్చారు. కానీ బీజేపీ పెద్దలు కరుణించలేదు. చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ రాయబారం నడిపినా కూడా వాళ్లు పట్టించుకోలేదు. పైగా పవన్ కల్యాణ్ నే చంద్రబాబుతో కలవద్దని తిప్పి పంపించారు. దీంతో బీజేపీతో టీడీపీ కలిసే ప్రసక్తే లేదని అందరూ గట్టిగా నమ్మారు.
అయితే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ సమావేశంసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. వాళ్ల మధ్య దాదాపు 45 నిమిషాల సేపు చర్చలు జరిగాయి. రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు, పొత్తులు, ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. లాంటి అనేక అంశాలపై వాళ్లు మాట్లాడుకున్నారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానమిచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా తన వైపు నుంచి ఏం కావాలో క్లారిటీ ఇచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత రెండు పార్టీలు వాళ్ల పనుల్లో నిమగ్నమైపోయాయి. లోపల ఏం జరిగిందో ఎవరూ చెప్పలేదు. దీంతో ఆ ఉత్కంఠ అలాగే కొనసాగుతూ ఉండిపోయింది.
అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ దేశవ్యాప్తంగా తమతో కలిసి వచ్చే వాళ్లకోసం ఆలోచిస్తోంది. ఒకవేళ సంపూర్ణ మెజారిటీ రాకపోతే ఇబ్బంది పడతాం అని భావిస్తున్న బీజేపీ.. ముందుగానే కొంతమందిని తమ దారిలో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే అమిత్ షా.. చంద్రబాబుకు కబురు పెట్టారు. అమిత్ షాకు సొంత సర్వే టీమ్ ఉంది. ఐఐఎం గ్రాడ్యుయేట్లతో కూడిన ఈ టీం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై అమిత్ షాకు నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే అమిత్ షా.. చంద్రబాబుతో చర్చలు జరిపారు. అనంతరం ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలకు టీడీపీతో కలిసి వెళ్తే ఎలా ఉంటుందో చెప్పాలని కోరారు. తెలంగాణ వాళ్లు మాత్రం టీడీపీతో పొత్తు వద్దనే వద్దనే రిప్లై ఇచ్చారు. ఏపీ నేతలు మాత్రం కొంతమంది ఉంటే బాగుంటుందని, మరికొంతమంది లేకుంటే మంచిదని సూచించారు. అయితే ఏపీ, తెలంగాణ నేతలిద్దరూ పొత్తులపై అధిష్టానం ఫైనల్ గా ఎలా చెప్తే అలా ముందుకెళ్తామని తేల్చేశారు. దీంతో బంతి మళ్లీ ఢిల్లీ చేరుకుంది. ఇప్పుడు టీడీపీతో పొత్తు ఉండాలా, వద్దా అనేది కేంద్రమే నిర్ణయిస్తుంది. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో పెద్దగా ఉపయోగం లేకపోయినా ఏపీలో మాత్రం లబ్దిపొందొచ్చని బీజేపీ భావిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబుతో మళ్ళీ మళ్లీ భేటీ అయి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.













