మేం అధికారంలోకి వచ్చాక బీసీలకు.. 50 ఏళ్లకే : చంద్రబాబు
ఆధునిక సమాజంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫులే అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పులే జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆ మహాశయుడి ఆశయాల్లో భాగంగానే టీడీపీ బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించిందని తెలిపారు. ఫులే స్ఫూర్తితోనే బీసీలకు మరిన్ని హామీలు ఇచ్చినట్లు తెలిపారు. మేం అధికారంలోకి వచ్చాక బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తాం. రూ.1.50 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తాం. స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం. వృత్తిదారులకు ఆదరణ పథకం ద్వారా రూ.5 వేల కోట్ల విలు చేసే పరికరాలను అందిస్తాం. చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి, పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతాం. పెళ్లి కానుక రూ.లక్షకు పెంచి ఇస్తాం. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం. బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలను అందజేస్తాం అని పేర్కొన్నారు.













