ఏపీ 2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి పోలింగ్ కోసం అప్పుడే కసరత్తు మొదలుపెట్టేసారు. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వార్ రూమ్ కు చేరుకున్న చంద్రబాబు.. ఆంధ్రాలోని అన్ని జిల్లాలు.. నియోజకవర్గ నేతలతో మంతనాలు జరిపారు. రేపు పోలింగ్ నేపథ్యంలో తీసుకోవలసినటువంటి చర్యలపై పార్టీ నేతలకు.. వార్ బృందాలకు సూచనలతో పాటు ఆదేశాలు కూడా జారీ చేశారు. పోలింగ్ జరిగే సమయంలో ఎంతో సమన్వయంతో అనేక అంశాలపై దృష్టి పెట్టాలని భావించిన చంద్రబాబు ప్రత్యేకమైన విభాగాలను ఏర్పాటు చేసి.. వాటి బాధ్యతను ప్రత్యేకంగా కొందరికి అప్పగించారు. గ్రామ స్థాయి పోలింగ్ బూత్ దగ్గర నుంచి పట్టణ స్థాయి పొలింగ్ బూత్ వరకు ప్రతి అంశాన్ని మానిటరింగ్ చేసే విధంగా చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారు. ప్రధాన వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పోలింగ్ సమస్యలపై సమాచారం అందే విధంగా.. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించే విధంగా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. మొత్తానికి ఈసారి ఎలాగైనా గెలవాలి అన్న పట్టుదల పసుపుదళం నేతలలో గట్టిగా కనిపిస్తోంది.













