ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమల్లో ముఖ్యమంత్రి, స్పీకర్ పాల్గొన్నారు. దాదాపు 50 ఎకరాల చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన చెరువుకి తారకరామా సాగరంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల ఎన్టీఆర్ సాగర్‌లో బోటులో విహరించారు. అనంతరం చెరువు పక్కనే పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్లను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక మహానాయకుడు, యుగపురుషుడు అని కొనియాడారు. సత్తెనపల్లికి వన్నె తెచ్చేలా తారకరామసాగర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్ హయాంలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో సత్తెనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటైందన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు ఎంతో నమ్మకంతో తనను గెలిపించారని అన్నారు. రాష్ట్రానికి బీజేపీ మేలు చేస్తుందని భావించామని, కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే తెలుగుజాతి తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ముందుకెళ్తున్నామని అన్నారు.













