రఘు రామకృష్ణ రాజు కోసం చంద్రబాబు కొత్త ఎత్తు..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మహా సంగ్రామాన్ని తలపించే విధంగా ఉన్నాయి. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీలు మారుతున్న నేతలు కొందరైతే.. తమ అభ్యర్థుల కోసం నియోజకవర్గాల వేటలో ఉన్న లీడర్లు మరి కొంతమంది. తాజాగా టీడీపీ గూటికి చేరిన రఘు రామకృష్ణ రాజు కోసం చంద్రబాబు నరసాపురం టికెట్ ప్రయత్నిస్తున్నారు. నిన్న ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో కూటమి నేతల మధ్య జరిగిన భేటీలో ఈ విషయం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. కూటమిగా పోటీ చేయడానికి ఒప్పుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాలేదు. తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ కి ఇవ్వడానికి బీజేపీ ఏదో సూత్రప్రాయంగా ఒప్పుకుంది. అయితే ఈ స్థానానికి బదులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబలపల్లె సీటును బీజేపీ ఆశిస్తోంది. ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్ పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అభ్యర్థుల మార్పు విషయంపై కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఎంపీ రఘురామకృష్ణ రాజు నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే విధంగా.. దానికి బదులు ఉండి అసెంబ్లీ స్థానం బీజేపీ కు ఇచ్చే విధంగా చంద్రబాబు ప్రతిపాదన పెట్టారు. అంటే నర్సాపురం లోక్ సభ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస శర్మ ఉండి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదన పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ నేతలు అధిష్టానంతో ముచ్చటించిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత ఇస్తామని చెప్పారట.













