టీడీపీ వీరాభిమాని కొత్త స్టైల్..పెళ్లి పత్రికతో ప్రచారం..
రాజకీయాల గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా అందరూ ఆసక్తిగా చర్చలో పాల్గొంటారు. ఎందుకంటే రాజకీయాలపై ప్రజలకు ఉన్న అభిమానం అలాంటిది. మరి ముఖ్యంగా ఇష్టమైన పార్టీపై తమ అభిమానాన్ని చాటుకోవడానికి ప్రజలు ఎప్పుడు వెనుకడుగు వేయరు. ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఓ కొత్త జంట తమ వివాహ ఆహ్వాన పత్రిక పై చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ముద్రించి వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకుంది. మార్చ్ 24 ఆదివారం రాత్రి బాసాన కృష్ణారావు వివాహం జరిగింది.పార్వతీపురం లోని మన్నెం జిల్లా బలిజిపేట మండలం నారాయణ నాడు వలసకు చెందిన బాసాన కృష్ణారావు తెలుగుదేశం పై తనకున్న అభిమానాన్ని చాటుకోవడానికి తన పెళ్లి పత్రికను ఉపయోగించాడు. నారా చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో లో ప్రకటించిన ఆరు పథకాలను తన పెళ్లి పత్రిక పై ముద్రించి అందరిని ఆశ్చర్యపరచాడు. ఇక ఈ పథకాలతో పాటు ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలు అలాగే బొబ్బిలి పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన టిడిపి అభ్యర్థుల ఫోటోలను కలిపి ముద్రించారు. తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలుగుదేశం పార్టీ రూలింగ్ లోకి వస్తే కలిగే ప్రయోజనాల గురించి అర్థమయ్యేలా వివరించాలి అనే ఉద్దేశంతోటే అతను అలా చేశాడట. మొత్తానికి ఓ వెరైటీ ప్రచారానికి ఇతను నాంది పలికాడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.













