గన్నవరం పాకిస్థాన్ లో ఉందా? : చంద్రబాబు
ఒక ప్రణాళిక ప్రకారమే గన్నవరంలోని తమ కార్యాలయంపై వైసీపీ సైకోలు దాడికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. గన్నవరంలో ధ్వంసమైన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కొంతమంది బుద్దిలేని పోలీసుల వల్లే సమస్యలు వస్తున్నాయి. గన్నవరం పాకిస్థాన్లో ఉందా? అని ప్రశ్నించారు. తనను పర్యటించొద్దు అనటానికి పోలీసులెవరు? ఫిర్యాదులు చేసిన వారిపై కేసులు పెడతారా? పోలీసుల వింత చేష్టలు అర్థంకావట్లేదు. బెదిరిస్తే పారిపోతామనుకుంటున్నారేమో, పోరాడుతూనే ఉంటాం అన్నారు. రెచ్చగొట్టి తప్పుడు పనులు చేస్తే జైలుకు పోవాల్సిందే. పిచ్చి రౌడీ చేష్టలకు భయపడేది లేదు. వడ్డీతో సహా అందరికీ చెల్లిస్తాం.
జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఎందరో అధికారులు జైలుకు వెళ్లారు. తప్పుచేసి పోలీసులు అదే బాట పట్టొదు. బాధ, ఆవేదనతో ప్రశ్నిస్తున్నా అన్నారు. ఇకనైనా మారండి, ఎన్ని వేలమంది వస్తారో రండి, దొంగాటలు వద్దు. లగ్నం పెట్టుకుందా. తాడోపేతో తేల్చుకుందా. దైర్యం ఉంటే పోలీసులు లేకుండా సైకోని కూడా తీసుకురండి అని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల కంటే ఘోరంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బరితెగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని, ఎందరో మహానుభావులు పుట్టిన జిల్లాలో సైకోలు స్వైరవిహారం చేస్తున్నారన్నారు. ప్రజా ఉద్యమ రూపకల్పనకు ప్రజలే శ్రీకారం చుట్టాలని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చేసే ఉద్యమంలో అంతా ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.













