హీరో శివాజీతో నాకెలాంటి సంబంధం లేదు
హీరో శివాజీ ప్రత్యేక హోదా సాధన సమితిలో సభ్యుడే కాదని ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తేల్చిచెప్పారు. హోదా సాధనకై మద్దతిచ్చిన వారిలో శివాజీ ఒకడని తెలిపారు. ఆయా సమయాల్లో ఆయన సలహాలు మాత్రమే తీసుకున్నామని సృష్టం చేశారు. అయినా సాధన సమితి నుంచి ఆయనెప్పుడో వెళ్లిపోయారని పేర్కొన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా షరతులతో కూడిన మద్దతు మాత్రమే ఇవ్వాలని సూచించారు. గతంలో మాదిరి కాకుండా కేంద్రంపై కచ్చితమైన ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు. వచ్చే ప్రభుత్వంలో విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. విభజన హామీల అంశంలో మొదటి నుంచి అఖిలపక్షానికి ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవించారు. ఈసారి గతంలో కంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు.













