ఏపీ హైకోర్టు సీజేగా ప్రవీణ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కేటాయించిన 14 మంది న్యాయమూర్తుల్లో అందరికంటే సీనియర్ కావడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయన్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జవనరి 1 నుంచి ఈయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయ బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొంది.
జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రముఖ సీనియర్ న్యాయవాది దివంగత సి.పద్మనాభరెడ్డి కుమారుడు. 1961 ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. 1 నుంచి పది వరకూ హైదరాబాద్‌లోని లిటిల్ ప్లవర్ హైస్కూల్లో, తదుపరి ఇంటర్‌ను అదే జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. నిజాం కాలేజీలో బీఎస్సీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుంచి లా డిగ్రీ పొందారు. 1986 ఫిబ్రవరి 28న ఆంధ్రప్రదేశ్ బార్కౌన్సిల్లో సభ్యత్వం తీసుకున్నారు. తండ్రి పద్మనాభరెడ్డి ఆఫీసు నుంచే న్యాయవాది వృత్తి ప్రారంభించారు. క్రిమినల్, కాన్స్టిట్యూషనల్ లా కేసుల్లో చురుగ్గా వ్యవహరించేవారు. తదుపరి సొంతంగా న్యాయవాదిగా వృతి ప్రారంభించారు. 2012 జూన్ 29న ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2013 డిసెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. వీరి పూర్వీకులది అనంతపురం జిల్లా గుత్తి.













