ఫలించిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన… 45 లక్షల మందికి ఉపాధి

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఫలితాలు కార్యరూపం దాల్చుతున్నాయి. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులు, విభజన చట్టాల హామీలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర విషయాలపై కేంద్ర మంత్రులతో కూలంకషంగా చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని, సీఎం తిరుగుపయనమైన మూడో రోజుకే దాని ఫలితాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఏపీలో గ్రీన్‌ఫీల్డ్ పెట్రోలియం రిఫైనరీ యూనిట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇదే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర ఉక్కు, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి, ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ ఈ యూనిట్ ఆవశ్యకతను కేంద్ర మంత్రికి కూలంకషంగా వివరించారు. దీంతో పెట్రోలియం రిఫైనరీ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కూడా ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు.
రాష్ట్ర పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీలో ఈ ప్రాజెక్టును నెలకొల్పేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. అంతేకాకుండా పెట్రో రిఫైనరీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను చూసుకునేందుకు ఓ వర్కింగ్ గ్రూపును కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. సుమారు 25 నుంచి 30 వేల కోట్లతో యాంకర్ ఇన్వెస్ట్‌మెంట్‌గా రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పింది. దీని ద్వారా ఏపీకి దాదాపుగా 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులే కాకుండా దాదాపుగా ఓ 45 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అందుకే సీఎం జగన్ ఈ ప్రాజెక్టును అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తన ఢిల్లీ పర్యటనలో దీనికి ప్రాధాన్యం కల్సించారు. అయితే తగ్గిన కార్పొరేట్ ట్యాక్స్, వడ్డీరేట్లకు అనుగుణంగా ఓ రిపోర్టును తయారు చేసే గురుతర బాధ్యతను ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌తో పాటు ఎస్‌బీ క్యాప్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇథనాల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కూడా కేంద్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు వెయ్యి కోట్లతో ఈ రిఫైనరీ ఏర్పాటుకు కూడా కేంద్రం ఓకే చెప్పింది.