Bapatla: సూర్యలంక బీచ్ కు కేంద్రం గుడ్ న్యూస్
ఏపీలో(Andhrapradesh) పర్యాటక రంగంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెడుతోంది. ముఖ్యంగా తీర ప్రాంతాల అభివృద్ధి విషయంలో పక్కాగా వ్యవహరిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉండటంతో పర్యాటక రంగం రూపు రేఖలు మారుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధులు విడుదల చేసారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని ఏపీ పర్యాటక శాఖ ప్రకటించింది.
ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసి సూర్యలంక బీచ్ కు నిధులు ఇవ్వమని మంత్రి దుర్గేశ్ (Kandula Durgesh) కోరగా కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం, పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు కేంద్రానికి పర్యాటక శాఖ పంపింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నిధులు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు మంత్రి దుర్గేశ్ ధన్యవాదాలు తెలిపారు.
త్వరలోనే సూర్యలంక ప్రాజెక్టు పట్టాలెక్కనుందని, సరికొత్త హంగులతో పర్యాటకులకు దర్శనమివ్వబోతుందని పర్యాటక శాఖ ప్రకటించింది. సూర్యలంక బీచ్ లో మౌలిక వసతుల కల్పన, పరిశుభ్ర బీచ్ గా తీర్చిదిద్దుతామని పేర్కొంది. రాష్ట్ర పర్యాటక ప్రగతికి కృషి చేస్తున్న టూరిజం సెక్రటరీ అజయ్ జైన్, పర్యాటకశాఖ అధికారులను అభినందించారు మంత్రి దుర్గేష్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ శాస్కి స్కీమ్ క్రింద అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు రూ.172.34 కోట్లు విడుదల చేయగా.. తాజాగా సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు విడుదల చేసింది కేంద్రం.













