ఏపీలో పెట్రో కారిడార్…. గౌతమ్ రెడ్డి

ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో పెట్రోకెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఉక్కు, పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‍ను ఆయన కలిశారు. అనంతరం గౌతమ్‍రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గెయిల్ ఇతర సంస్థలతో కలిసి పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశాలపై కేంద్ర మంత్రితో మాట్లాడినట్లు తెలిపారు. పెట్రోకారిడార్ రంగంలో రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందని తెలిపారు. మన రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న చక్కెర కర్మాగారాలతో భారీ ఎత్తున మొలాసిస్ ఉత్పత్తి అవుతున్నందున దానిని ఇథనాల్‍గా మార్చేందుకు రిఫైనరీలు పెట్టాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. రూ.100 కోట్లతో గ్రీన్‍ఫీల్డ్ రిఫైనరీ పెడతామని కేంద్ర మంత్రి తెలిపారని వెల్లడించారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పెట్టుబడులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా ఉన్నారు.