పోలవరం కాంట్రాక్ట్ పనులు నవయుగకే
పోలవరం ప్రాజెక్టుపై ఢిల్లీలోని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వద్ద కీలక భేటీ ముగిసింది. ప్రాజెక్టులో స్పిల్వే కాంక్రీటు, స్పిల్ ఛానల్ పనులను కొత్త గుత్తేదారుకు అప్పగించే అంశంపై ఈ సమావేశంలో ఓ సృష్టత వచ్చింది. దీనిపై రెండు గంటల పాటు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ, జలసంఘం అధికారులతో భేటీ అనంతరం మంత్రి గుత్తేదార్లతో సమావేశమయ్యారు. నవయుగ, ట్రాన్స్ట్రాయ్ గుత్తేదారు సంస్థల్లో వేటికి ఈ పనులు అప్పగించే అంశంపై చర్చించారు. పోలవరం ప్రధాన గుత్తేదారుగా ఉన్న ట్రాన్స్ ట్రాయ్ సంస్థ ఇప్పటివరకు అనుకున్న విధంగా నిర్దిష్ట సమయంలో పనులు పూర్తిచేయని నేపథ్యంలో ఈ పనులను నవయుగకు అప్పగించాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 నాటికి పాత ధరలతోనే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు నవయుగతో అంగీకారం కుదిరింది. నవయుగ కంపెనీకి స్పిల్వే, ఛానల్ పనుల్ని పూర్తిచేసేందుకు నిర్ణీత గడువును ఇవ్వడంతో పాటు అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకొనేందుకు అవగాహన ఒప్పందం కుదురనుంది. దీనిప్రకారం స్పిల్వే, స్పిల్ఛానల్ పనుల్ని నవయుగ సంస్థ వారం రోజుల తర్వాత చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.













