కేంద్ర బృందంతో సీఎం వైఎస్ జగన్
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాలకు రూ.8,084 కోట్ల నష్టం వాటిల్లిందని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో మౌలిక సౌకర్యాలకు రూ.5 వేల కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.3వేల కోట్ల మేర నష్టం జరిగిందన్నారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసిన కేంద్ర బృందం సభ్యులు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రైతులను ఆదుకునేందుకు వీలైనంత ఎక్కువ సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి వారిని కోరారు.
దెబ్బతిన్న ధాన్యం, వేరుసెనగ కొనుగోలుకు నాణ్యతా ప్రమాణాలు సవరించాలని విజ్ఞప్తి చేశారు. జరిగిన నష్టానికి పెట్టుబడి రాయితీ అందించడానికి అంచనాలు తయారవుతున్నాయని చెప్పారు. కేంద్ర బృందాన్ని పంపినందుకు ప్రధాని, హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వ్ఞిప్తి మేరకు అనంతపురం జిల్లాలో వేరుసెనగను పరిశీలించినందుకు బృందానికి ధన్యవాదాలు చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఎక్కవ నష్టం జరిగిందని, చెరువులు కాల్వలకు గండ్లు పడ్డాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు. త్వరలో కేంద్రానికి నివేదిక ఇస్తామని ఈ బృందానికి సారథ్యం వహిస్తున్న సౌరమ్ రాయ్ తెలిపారు. అధికారులు సమగ్ర సమచారం అందించారని చెప్పారు.













