ఏపి రాజధాని పై మా జోక్యం ఉండదు: కేంద్రం..
ఒక రాష్ట్రం ఏర్పాటు చేసుకునే రాజధానికి సంబంధించి తమకు ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తమ పాత్ర నామమాత్రమేనని వెల్లడించింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ అంశం ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పరిధిలోకి వెళ్లిన సంగతి విదితమే. ఈ నేపధ్యంలో కోర్టులో దాఖలైన పిటిషన్ల దరిమిలా కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కౌంటర్ దాఖలు కోరుతూ నోటీసులు జారీ చేసిన సంగతీ తెలిసిందే. దీనికి కేంద్ర ప్రభుత్వం గురువారం స్పందించింది. రాష్ట్ర రాజధాని విషయంలో తమ వైఖరి కుండబద్ధలు కొట్టింది. గతంలో ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని నాటి ప్రభుత్వం ఎంపిక చేసిందని, తదనుగుణంగా గెజిట్‌లో నోటిఫై చేసిందని కేంద్రం గుర్తు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం దానిని 3 రాజధానులుగా మారుస్తూ చట్టసభల్లో తీర్మానించిందని తెలిపింది.
రాజధాని ఖర్చు మాటేమిటి?
అమరావతిలో నిర్మించిన భవనాలకు సంబంధించి అయిన ఖర్చు వివరాలు ఆయా నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి… తదితర అంశాలకు సంబంధించి సమగ్ర సమాచారం తమకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సదరు భవనాలు నిరుపయోగంగా మారి శిధిలమైపోతే, రూ.కోట్ల ప్రజాధనం వృధా అయినట్టే కదా అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా 52 మంది కాంట్రాక్టర్లకు పనుల కోసం ఒప్పందాలు పెండింగ్‌లో ఉన్నట్టు పిటిషన్ దారుడు కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అకౌంటెంట్ జనరల్‌ను కేసులో ఇంప్లీడ్ చేయాలని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది.













