అమరావతే ఏపీ రాజధాని.. స్పష్టం చేసిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీ రాజధాని అంశాన్ని లేవనెత్తారు. రాజధానిపై గందరగోళనం నెలకొని ఉందని, స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతే అని చెప్పారు. అయితే రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదేనన్నారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తమ దృష్టికొచ్చిందని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి మూడు రాజధానులు నిర్ణయించింది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొచ్చింది. కొద్దిరోజుల క్రితం ఆ చట్టాల్లో మార్పులు చేస్తామంటూ వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో మూడు రాజధానులపై సందిగ్ధత ఏర్పడిరది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీ రాజధానిపై స్పష్టత కోరాగా కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.













