పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తి శాఖ కీలక ప్రకటన చేసింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని సాంకేతిక కారణాలతో పనుల్లో జాప్యం జరుగుతోందని తేల్చి చెప్పింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం చెప్పింది. వచ్చే ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, పునరావాసం, పరిహారంలోనూ జాప్యం జరుగుతోందన్నారు. బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యంతో పాటు కరోనా వల్ల పోలవరం నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని వెల్లడించారు.
ప్రాజెక్టు స్పిల్ వే ఛానల్ పనులు 88 శాతం, అప్రోచ్ ఛానల్ ఎర్త్‌వర్క్ పనులు 73 శాతం పూర్తి అయ్యాయి. ఫైలట్ ఛానల్ పనులు 34 శాతమే పూర్తయ్యాయని కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి తెలిపారు. పోలవరం సవరించిన అంచానాలు రూ.55,548 కోట్లకు టీఏసీ ఆమోదించిన మాట వాస్తవమేనని అన్నారు. 2020 మార్చిలో సవరించిన అంచనాలపై ఆర్సీసీ నివేదిక ఇచ్చిందని దాని ప్రకారం రూ.35,950.16 కోట్లకు మాత్రమే కేంద్రం అంగీకారం తెలిపింది.













