ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సీరియస్ …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం మరోసారి సీరియస్ అయింది. ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి సమాధానం ఇవ్వలేదు. ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల కోసం ఖర్చు చేయడంపై వెంటనే నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించింది. ప్రధాని కార్యాలయానికి నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున తక్షణమే నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వ శాఖ లేఖలు పంపింది. ఎంపీ నందిగం సురేష్ ఒక చర్చి నిర్మాణానికి రూ.40 లక్షలకు పైగా నిధులు ఇచ్చినట్లు మీడియాలో వచ్చిన కథనాలతో ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు.
ప్రత్యేక పరిస్థితుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన ఈ నిధుల్ని మత సంబంధ కార్యక్రమాలకు, మతపరమైన భవనాల నిర్మాణాలకు ఖర్చు చేస్తున్నట్లుగా పీఎంవోకు నివేదించారు. దీంతో పాటు రాష్ట్రంలో మతమార్పిడులకు కూడా ఈ నిధులు వినియోగిస్తున్నట్టు తెలిపారు. రఘురామ రాసిన లేఖపై నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రెండు నెలల క్రితం గణాంకాలు, ప్రణాళిక శాఖ లేఖ పంపింది. అప్పటి నుంచి స్పందించక పోవడంతో రాష్ట్ర సీఎస్‌కు గుర్తు చేస్తూ గణాంకాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమ్య మరో లేఖ పంపారు. వీలైనంత తర్వగా సవివరమైన నివేదిక పంపాలని ఇరువురి పంపిణ లేఖలో గణాంకాల శాఖ కోరింది.













