CCTV: ఏపీలో ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు
ఏపీలో భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సీసీ కెమెరాల విషయంలో హోం శాఖ అప్రమత్తమవుతోంది. దీనిపై తాజాగా హోం మంత్రి అనిత (Anitha) కీలక ప్రకటన చేసారు. పల్లెపల్లెలో ‘నిఘా’ నేత్రాలు ఏర్పాటు చేస్తామన్నారు అనిత. సీసీ కెమెరాల ఏర్పాటు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. త్వరలో పాయకరావుపేటలోనూ అమలు చేస్తామన్నారు. అసాంఘీక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటలకు చెక్ పెడతామని.. నేరాల నియంత్రణలో ప్రతి పౌరుడిది బాధ్యతే అని స్పష్టం చేసారు.
ఇకపై ఇంట్లో కనీస అవసరాల్లో ఒకటిగా సీసీ కెమెరా ఉండాలన్నారు. ఫోన్‌కి స్క్రీన్ గార్డ్ సరే.. విలువైన ప్రాణం మాటేమిటి? అని ప్రశ్నించారు. విజయనగరంలో డ్రోన్ ఎగరేసి.. పేకాటరాయుళ్లను పట్టుకున్నామన్నారు. జగ్గయ్యపేటలో సీసీ టీవీల ఏర్పాటు ప్రారంభోత్సవానంతరం హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేసారు. జగ్గయ్యపేటలో సీసీ కెమెరాల ఏర్పాటు పైలట్ ప్రాజెక్ట్‌ను హోంమంత్రి అనిత ప్రారంభించారు. కొత్తగా 509 సీసీల ఏర్పాటుతో నేరాల నియంత్రణలో జగ్గయ్యపేట సర్కిల్ నమూనాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
సీసీ టీవీల ఏర్పాటుకు కృషి చేస్తోన్న సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. జగ్గయ్యపేటలోని 71 గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలకు ప్రతి ఒక్కరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇకపై ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రక్షిస్తామన్న ఆమె.. ప్రతి ఇంటికి సీసీ కెమెరా అనివార్యమన్నారు. గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సీసీ కెమెరాలు, డ్రోన్ లతో నేరస్థులు ఎక్కడికక్కడ చెల్లాచెదురవుతున్నారని.. కొన్ని రోజుల కిందటే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1000సీసీ కెమెరాలు, 28 డ్రోన్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. టీవీ, ఫ్రిడ్జి, ఏసీలతో పాటు ప్రతి ఇంట్లో సీసీ కెమెరా కూడా కచ్చితంగా ఉండాలని సూచించారు. మద్యం, డ్రగ్స్, గంజాయి, పేకాట వంటి అసాంఘీక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.













