ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి 1-7 తరగతులకు సీబీఎస్ఈసీ విధానం అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మనబడి, నాడు-నేడు పనులు, విద్యాకానుకపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులతో జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏడాదికి ఒక తరగతి చొప్పున 2024 నాటికి పదోతరగతి వరకు సీబీఎస్ఈసీ విధానం అమల్లోకి తేవాలని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాకానుకపైనా సీఎం సమీక్షించారు.విద్యాకానుకలో ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీలను చేర్చాలని, దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. పాఠ్యపుస్తకాలు కూడా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అత్యంత నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. ఉపాధ్యాయులకూ డిక్షనరీలు ఇవ్వాలని చెప్పారు. అమ్మఒడి పథకం కింద విద్యార్థులకు ఇచ్చే ల్యాప్టాప్ల నాణ్యత, సర్వీసు బాగుండాలన్నారు.
తొలి విడత నాడు-నేడు పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడెక్కడ పనులు పెండింగ్లో ఉన్నాయనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సత్వరమే వాటిని పూర్తిచేయాలన్నారు. పాఠశాలలు మంచి డిజైన్లతో ఆహ్లాదకరంగా ఉండాలన్నారు. మౌలిక సదుపాయాల్లో రాజీపడొద్దని, పనులు పూర్తయిన నిర్మాణాల ఫొటోలు తీసి వెబ్సైట్లో పొందుపరచాలని ఆదేశించారు. రెండో దశ పనులను కూడా సత్వరమే ప్రారంభించాలని, తొలిదశలో ఎదురైన ఇబ్బందులను అధిగమించాలని అధికారులకు జగన్ దిశానిర్దేశం చేశారు.













