అందరికీ ఆరోగ్యం ఇచ్చేది యోగా : చంద్రబాబు
యోగా ఓ కులానికి, మతానికి సంబంధించినది కాదని అందరికీ ఆరోగ్యం ఇచ్చేది యోగా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ యోగా వారసత్వ సంపద అని అన్నారు. మెదడుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని, చిన్నచిన్న సమస్యలకే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. యోగాతోనే మెదడును కంట్రోల్ చేసుకోవచ్చని తెలిపారు. యోగాతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. మనిషి జీవితంలో యోగా ఒక భాగం కావాలని సూచించారు. ప్రతిరోజూ గంట పాటు యోగా చేయడం ఎంతో ప్రశాంతత ఇస్తుందని అన్నారు. మనిషి మనిషిగా బతకాలంటే యోగా-ధ్యానం గొప్ప సాధనాలని అభిప్రాయపడ్డారు.













