మాకు సింగపూర్ సహకారం కావాలి
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసే వ్యాపారాల్లో సింగపూర్ సంస్థలు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దేశ ఆర్థిక మంత్రి హుంగ్ సీ క్వేట్ను కోరారు. కేవలం ఆర్థిక సాయం అందించడమే కాకుండా ఆ సంస్థల నుంచి తక్కువ వడ్డీతో ఆర్థిక సహాయం అందేలా మార్గదర్శనం చేయాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్ మూడోరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు ట్రెజరీ భవనంలో క్వేట్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతలను, ప్రాధాన్యాలను వివరించారు. సింగపూర్‌లో బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది. ఏపీలో నైపుణ్యం కలిగిన మాన వనరులున్నాయి. ఉభయులం కలిస్తే ప్రపంచానికి అత్యుత్తమ ఉత్పత్తులు అందించగలం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వాణిజ్య నాయకత్వ లక్షణాలు పెంపొందించడం మా ధ్యేయం. ఈ విషయంలో మాకు సింగపూర్ సహకారం కావాలి. నైపుణ్యాభివృద్ధిలో మీ చొరవను అనుభవాన్ని వారికి అందించండి అని చంద్రబాబు పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాల కల్పనలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన సింగపూర్ నవ్యాంధ్రప్రదేశ్‌కి ఎంతో స్ఫూర్తినిస్తోందన్నారు. ఇక్కడి నైపుణ్యాలు, సాంకేతికతను వినియోగించుకుని అమరావతిలో అత్యుత్తమ పౌర సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. పౌర సేవల్లో నాణ్యత, జవాబుదారీతనం, పెంచడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే గరిష్టంగా వినియోగించుకుంటున్నాం. అన్ని రకాల పౌర సేవలు సమీకృతం చేసి ఒకే వేదిక నుంచి అందిస్తున్నాం. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సేవలందించే ప్రాజెక్టు చేపట్టాం. వాణిజ్యం, పెట్టబడుల ఆకర్షణలో ముందున్నాం. కొరియాకి చెందిన కియా మోటార్స్ సంస్థ 2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. వచ్చే ఏడాదికి వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభిస్తుంది. మేం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, ఇస్తున్న ప్రోత్సాహకాల వల్ల కియాతో పాటు, ఇసుజు, హీరో మోటర్స్ వంటి దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులతో వచ్చాయి అని తెలిపారు.













