హార్డ్‌వేర్, సెల్‌ఫోన్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా తిరుపతి
ఎలక్ట్రానిక్ రంగంలో 5లక్షల ఉద్యోగాలు హార్డ్‌వేర్, సెల్‌ఫోన్ సంస్థలకు తిరుపతి కేరాఫ్ అడ్రస్‌గా మారనుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో సెల్కాన్ చరవాణి యూనిట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.150కోట్లతో ఈ యూనిట్ నెలకొల్పారు. ఈ సందర్భంగా యూనిట్లో తయారైన తొలి ఫోన్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇక్కడ పుట్టిన వ్యక్తి పారిశ్రామికవేత్తగా ఎదిగి ఇక్కడే పరిశ్రమ పెట్టి స్థానికులకు ఉపాధి కల్పించడం గర్వకారణమన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ మానుఫ్యాక్చరింగ్ రంగానికి నిలయంగా మారాలి. ఇక్కడ సెల్‌ఫోన్ కంపెనీ వస్తుందంటే ఎవరూ నమ్మలేదు. దీన్ని సాధించి చూపించాం. తిరుపతికి దేశ విదేశాలకు చెందిన ఎన్నో విద్యాసంస్థలు వస్తున్నాయి. ఈ నగరం త్వరలోనే ఎడ్యుకేషనల్ హబ్‌గా మారుతుంది. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తాం. ఎవరు అడ్డుకున్నా అభివృద్ధి ఆగదు’ అని చంద్రబాబు అన్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏడాది లోపు మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.













