అమరావతి అమెరికన్ హాస్పిటల్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం
ప్రవాసాంధ్రులు నిర్మించ తలపెట్టిన అమరావతి అమెరికన్ హాస్పిటల్స్ నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు రిమోట్ ఆప్షన్ ద్వారా శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఇబ్రహీంపట్నంలోని 20 ఎకరాల స్థలంలో రూ.600 కోట్ల పెట్టుబడితో 3దశల్లో 700 పడకలతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కానుంది. 2019 మార్చి నాటికి ఈ ఆస్పత్రి మొదటి దశ నిర్మాణం పూర్తవుతుందని అంచనా. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో గుండె ఆపరేషన్లకు అమెరికా నుంచి అమరావతి రావాలి.’ అని ఆకాంక్షించారు. రాజధాని ప్రాంతం వైద్యానికి ప్రసిద్ధి చెందాలని సంకల్పించామని, దానికి అనుగుణంగా 10 అత్యుత్తమ యూనివర్సిటీల్లో నాలుగు ఏపీకి వచ్చాయని అన్నారు. 13 వైద్య విశ్వవిద్యాలయాలు, అత్యంత అధునాతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఇక్కడ ఏర్పాటు కానున్నాయని తెలిపారు. అమెరికాలో వైద్య ఖర్చు ఎక్కువని, అదే అమరావతిలో ఖర్చు తక్కువగా ఉంటుందన్నారు.
రాజధాని నిర్మాణమనేది చాలా కష్టతరమైన విషయమని, అలాంటి కష్టతరమైన రాజధాని నిర్మాణాన్ని ప్రపంచంలోనే ఆధునిక రాజధానిగా నిర్మించాలని సంకల్పించామని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. అమరావతి అమెరికన్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతికి 13 వైద్య కళాశాలలు వస్తున్నాయని, అలాగే రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ముందుకొస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఎయిమ్స్ కు అవసరమైన భూమి, ఇతర అనుమతులన్నీ ఒక్క రూపాయి తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం ఇచ్చిందని నవనీత కృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అమెరికాలో ఉన్న తాము చాలా బాధపడ్డామని, జన్మభూమికి ఏదైనా చేయాలని నిర్ణయించుకు న్నామన్నారు. అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, వైద్య కళాశాల ప్రారంభించాలని భావించి మంత్రి దేవినేని ఉమకు చెబితే, ఏం కావాలంటే అది ఇప్పిస్తాం రండి అన్నారన్నారు.













