అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
ఆంధ్రా అయోధ్యగా గుర్తింపు పొందిన కడప జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. పండువెన్నేల్లో ఆలయ ప్రాంగణంలో కల్యాణం కమనీయంగా సాగింది. స్వామీ అమ్మవార్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి 9:50 నిమిషాలకు ఉత్తరానక్షత్రయుక్త శుభలగ్నంలో జరిగిన కల్యాణాన్ని చూసి భక్తులు తరించారు. కాగా, సాయంత్రం వేళ ఒంటిమిట్టలో భారీగా గాలీవాన రావడంతో టీటీడీ చేసిన ఏర్పాట్లు వర్షార్పణం అయ్యాయి. ఇదిలా ఉంటే కల్యాణ సేవలో పాల్గొన్న అనంరతం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ శ్రీరాముడు ధర్మ, న్యాయపాలన చేశారని, అందుకే ప్రతి ఒక్కరూ రామరాజ్యం రావాలని కోరుకుంటారని అన్నారు. ఈ రోజు ఎన్ని అవాంతరాలు వచ్చిన సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా జరిగిందనీ, ప్రజలంతా భక్తిభావంతో ఉండడంతో ఈ కార్యక్రమం విజయవంతం అయిందని అన్నారు.













