కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. గత నెల 28న ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు వాట్సప్ ద్వారా అవినాష్ రెడ్డికి నోటీసులు పంపారు. తనకు నోటీసులు అందిన విషయం వాస్తవమేనని ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్రువీకరించారు. అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు రెండోసారి నోటీసులివ్వడం గమనార్హం. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగినప్పటి నుంచి ప్రతిపక్షాల వేళ్లన్నీ ఎంపీతో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి వైపే చూపిస్తున్నాయి. 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించి, వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఆ వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలతో ఇప్పుడు కీలకమైన అవినాష్ రెడ్డిని విచారిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా కేసు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయినందున విచారణ ముమ్మరం చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తోంది.













