మళ్లీ తెరపైకి వివేకా హత్య కేసు విచారణ.. అవినాశ్ రెడ్డికి నోటీసులు..!
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సా…గుతూనే ఉంది. ఈ కేసును నిగ్గు తేల్చేందుకు సీబీఐ తీవ్రంగా శ్రమిస్తోంది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతుండడం.. ఒకరిని అరెస్టు చేయగానే మరొకరు బెయిల్ పై బయటకు వెళ్తుండడంతో అందరినీ కలిపి కూర్చోబెట్టే అవకాశం సీబీఐకి లేకుండా పోతోంది. అయితే వచ్చే నెలాఖరులోపు ఈ కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. దీంతో స్పీడ్ పెంచింది సీబీఐ. ఇందులో భాగంగా కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది సీబీఐ.
వివేకా హత్య కేసు దర్యాప్తు అవినాశ్ రెడ్డి ఫ్యామిలీ దగ్గరకు వచ్చి ఆగింది. ఇందులో ఆయన తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది. అంతేకాక పీఏ కృష్ణారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుంది. తనను కూడా అరెస్టు చేస్తారేమోనని అవినాశ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం… ముందస్తు బెయిల్ కు హైకోర్టు నో చెప్పకపోవడం.. సీబీఐకి హైకోర్టు షరతులు విధించడంతో అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయలేదు. అయితే అవసరమైతే ఆయన్ను కూడా అరెస్టు చేస్తామని మాత్రం కోర్టుకు వెల్లడించింది సీబీఐ. దీంతో తదుపరి విచారణలో అవినాశ్ అరెస్టు తప్పదేమోనని అందరూ భావించారు. అయితే గత నెలాఖరు వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు సూచించడంతో అవినాశ్ రెడ్డి జోలికి సీబీఐ వెళ్లలేదు. అంతేకాదు.. కనీసం ఆయన్ను విచారణకు కూడా పిలవలేదు.
హైకోర్టు గడువు ముగిసిన తర్వాత అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలుస్తుందని… ఆ సమయంలో అరెస్టు చేయవచ్చని అందరూ భావించారు. అయితే హైకోర్టు గడువు ముగిసిన తర్వాత కూడా సీబీఐ అవినాశ్ రెడ్డిని విచారణకు పిలవలేదు. దాదాపు 20 రోజుల నుంచి ఈ కేసు విచారణలో పెద్ద మార్పు లేదు. అయితే ఇప్పుడు మళ్లీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. దీంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఎర్రగంగిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో గంగిరెడ్డి సీబీఐ ఎదుట లొంగిపోయారు. ఉదయ్ కుమార్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా ఇవాళ కోర్టు తిరస్కరించింది. దీంతో నిందితులంతా ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటిసులు ఇవ్వడంతో రేపు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం కోర్టును ఆశ్రయించారు అవినాశ్ రెడ్డి. హైకోర్టు సమ్మతించినా.. ఆ తర్వాత సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీంతో హైకోర్టు వెనక్కు తగ్గింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సీబీఐ విచారణకు ఆటంకాలన్నీ తొలగిపోయాయి. రేపు అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవుతారా.. లేకుంటే కేవలం విచారణకోసమే పిలుస్తోందా అనేది తెలియాల్సి ఉంది.













