సీఎం జగన్ యూరప్ టూర్కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్.. ఒకే ఒక షరతు!
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు శుభవార్త చెప్పింది. ఆయన తలపెట్టిన యూరప్ టూర్కు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యూరప్ పర్యటనకు వెళ్లాలని అనుకున్న సంగతి తెలిసిందే. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. కుటుంబంతో కలిసి వెళ్లే ఈ పర్యటన తన వ్యక్తిగతమని, దీనికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ వేశారు. ఈ క్రమంలో తాను దేశం విడిచి వెళ్లకూడదని ఉన్న బెయిల్ షరతును సడలించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్పై ఈ నెల 17న సీబీఐ నుంచి కౌంటర్ దాఖలు చేశారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ఈ పిటిషన్లపై కోర్టులో వాదనలు ముగిశాయి. రెండు వైపు వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం.. ఈ నెల 21 నుంచి 29 వరకూ జగన్ యూరప్ టూర్కు పచ్చజెండా ఊపింది. కాకపోతే పర్యటనకు వెళ్లే ముందు జగన్ తన మొబైల్ ఫోన్, ఈ-మెయిల్ ఐడీ, పర్యటన వివరాలను కోర్టుతోపాటు సీబీఐకి కూడా తెలియజేయాలని షరతు విధించింది.













