Vijay Sai Reddy: విజయ్ సాయి రెడ్డి విదేశీ యాత్రకు క్లియరెన్స్ ఇచ్చిన సీబీఐ కోర్టు..
వైఎస్ ఆర్ కాంగ్రెస్ (YSR Congress) పార్టీ కీలక నేతగా, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy) ఇటీవల రాజకీయాలకు గుడ్ బై చెబుతూ సంచలన ప్రకటన చేశారు. ఇకపై రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని, వ్యవసాయం మొదలుపెట్టినట్లు ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. అయితే, రాజకీయాల నుంచి తప్పుకున్న కొద్ది రోజులకే ఆయనకు సంబంధించిన మరో కీలక విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో(CBI court) ఆయన దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా తీర్పు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తాజాగా విజయసాయిరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తిని రేకెత్తించింది. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారో ఏమో కానీ, విదేశీ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఫ్రాన్స్, నార్వే దేశాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఏ2గా ఉన్న కారణంగా ఆయన విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి అవసరం. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్‌పై శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై సీబీఐ అభిప్రాయాన్ని కోరగా, సానుకూల సమాధానం వచ్చింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆయన విదేశీ పర్యటనకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. సీబీఐ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతోనే కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఆయనకు ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు 15 రోజుల అనుమతి లభించింది. ఈ 15 రోజులు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 మధ్య ఏ సమయంలోనైనా ఉపయోగించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
ఈ అనుమతి పొందడంతో విజయసాయిరెడ్డి త్వరలోనే విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత ఆయన మొదటిసారి బయటకు వెళ్తుండటంతో ఈ ప్రయాణం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలి కాలంలో వైసీపీకి సంబంధించి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండగా, విజయసాయిరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ప్రస్తుతం ఆయన వ్యవసాయ రంగంలో ఆసక్తి చూపుతుండగా, రాజకీయాల నుంచి పూర్తిగా బయటకు వస్తారా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే వీటన్నిటి మధ్య ఆయన విదేశీ పర్యటన కోసం కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద కోర్టు అనుమతి లభించడంతో విజయసాయిరెడ్డి ప్రయాణం ఖరారైంది. ఇప్పుడు ఈ 15 రోజుల పర్యటన అనంతరం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై అందరి దృష్టి ఉంది.













