టీడీపీ నేతలకు ఊపిరాడనివ్వని కేసులు, నోటీసులు!
తెలుగుదేశం పార్టీ నేతలపై కేసుల పరంపర కొనాసుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదలు లోకేశ్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర.. ఇలా చెప్పుకుంటూ ఈ లిస్టు చాంతాడంత ఉంటుంది. ఇది ఇంతటితో ఆగట్లేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా టీడీపీ నేతలను బుక్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తాజాగా విశాఖ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఆ పార్టీ అధికార ప్రతినిధి వర్ల రామయ్యపై ప్రభుత్వం పంజా విసిరింది.
ధూళిపాళ్ల నరేంద్రను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన కొన్ని గంటల వ్యవధిలోనే విశాఖలో టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ రావు నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేశారు ఆధికారులు. అనుమతులు లేకుండా ఈ బిల్డింగ్ కడుతున్నారని అధికారులు చెప్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా కూల్చుతారని పల్లా శ్రీనివాసరావు వారిని ప్రశ్నించారు. అయితే తాము నోటీసులు ఇచ్చామని జీవీఎంసీ అధికారులు బదులిచ్చారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదంటున్నారు పల్లా శ్రీనివాస్. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న పాత భవనాన్ని కూల్చివేసి ఈ బిల్డింగ్ కడుతున్నట్టు చెప్పారు. టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో భారీ భద్రతా బలగాల మధ్య భవనాన్ని కూల్చేశారు.
ఇక.. టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్యకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కించపరుస్తూ కొంతమంది ఫోర్జరీ వీడియోలను పెడ్తున్నారని అప్పట్లో వర్ల రామయ్య తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ కేసును తిరగదోడారు పోలీసులు. అప్పట్లో చేసిన ఫిర్యాదుపై ఆధారాలు తీసుకుని సీసీఎస్ పోలీసుల ముందు హాజరు కావాలని ఇప్పుడు నోటీసులు జారీ చేశారు.
అధికార పార్టీపై తీవ్రంగా విరుచుకుపడుతున్న నేతలనే ప్రభుత్వం టార్గెట్ చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాళ్ల నోళ్లు మూయించేందుకే కేసులు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ భవనాన్ని కూల్చివేయడం కానీ, వర్ల రామయ్యకు నోటీసులు ఇవ్వడం కానీ అందులో భాగమేనంటున్నారు. మరి వీటిని టీడీపీ ఎలా ఎదుర్కొంటుందనేది వేచి చూడాలి.













