RGV: రామ్ గోపాల్ వర్మపై ఏపీలో కేసు నమోదు..! తాటతీయడం ఖాయమా..?
రామ్ గోపాల్ వర్మ.. భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు. అమితాబ్ బచ్చన్ లాంటి అగ్రస్థాయి నటులతో కూడా ఆయన సూపర్ హిట్ సినిమాలు తీశారు. టాలీవుడ్ లో మొదలైన ఆయన ప్రస్థానం బాలీవుడ్ వరకూ సాగింది. అయితే ఎవరికైనా కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్పుడప్పుడు నేలచూపులు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి కూడా అంతే. ఒకప్పుడు ఆయనతో సినిమాలు తీయాలని క్యూ కట్టిన నిర్మాతలెంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఆర్జీవీ మొహం చూసేందుకు కూడా ఆసక్తి చూపించట్లేదు. ఇందుకు ఆర్జీవీనే కారణం.
రామ్ గోపాల్ వర్మ మంచి టెక్నీషియన్ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన దర్శకత్వ ప్రతిభ మొత్తం సంకనాకి పోయిందని సినీ ప్రముఖులే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే గత కొన్నేళ్లలో ఆయన తీసిన సినిమాలన్నీ నాసిరకమైనవే. ముఖ్యంగా అసభ్య చిత్రాలతో చెడ్డపేరు తెచ్చుకున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్నా కథా చిత్రాలను ఎంచుకుని విమర్శల పాలయ్యారు. ఓ వర్గానికి, ఓ పార్టీకి కొమ్ముకాస్తూ ఆయన తీసిన సినిమాలు సక్సెస్ కాకపోగా మరిన్ని విమర్శలకు దారితీశాయి. ఆ క్రమంలో రామ్ గోపాల్ వర్మ కూడా రాజకీయ నాయకుడిలా చేసిన కొన్ని కామెంట్స్, చేసిన పోస్టులు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి.
గత ఐదేళ్లలో రామ్ గోపాల్ వర్మ ఏపీలో వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే విషయం అందరికీ తెలుసు. జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకి అనుకూలంగా ఆయన పలు సినిమాలు కూడా తీశారు. ముఖ్యంగా లక్ష్మీస్ ఎన్టీఆర్, వ్యూహం, శపథం లాంటి సినిమాలు టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ టార్గెట్ గా తీసుకుని రూపొందించినవే. ఈ సినిమా చిత్రీకరణ, ప్రమోషన్ల సందర్భంగా రామ్ గోపాల్ వర్మ వాళ్లను కించపరిచేలా సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. వాళ్ల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ గా చేసుకుని కించపరిచేలా ట్వీట్లు చేశారు. ఇవి అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. అయితే అప్పుడు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండడంతో రామ్ గోపాల్ వర్మ మరింత రెచ్చిపోయారు.
అయితే ఏపీలో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గెలవగానే రామ్ గోపాల్ వర్మ ఇకపై తాను రాజకీయాల గురించి మాట్లాడనని ఒట్టేసి కామ్ అయిపోయారు. అయితే గతంలో తమను, తమ పార్టీ నేతలను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్, పోస్టులపై మాత్రం టీడీపీ, జనసేన నేతలు వదలేలా లేరు. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత ఒకరు రామ్ గోపాల్ వర్మపై కేసు పెట్టారు. గతంలో తమను కించపరిచేలా వర్మ చేసిన కామెంట్స్, పోస్టులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు.. గత ప్రభుత్వం నుంచి రామ్ గోపాల్ వర్మకు డబ్బు ముట్టిందనే ఆరోపణలున్నాయి. వాటిపైన కూడా ప్రభుత్వం విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చిక్కుల్లో పడ్డట్లే..!













