రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై దాఖలైన వ్యాజ్యాలపై మే 3వ తేదీ నుంచి రోజువారీ విచారణ జరపాలని హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. రాజధాని వ్యాజ్యాలపై ఏ విధంగా విచారణ చేపట్టాలనే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలో త్రిసభ ధర్మాసనం ఏర్పాటైంది. పిటిషనర్లు, ప్రభుత్వం తరపు న్యాయవాదుల వాదనలు ధర్మాసనం ఆన్లైన్ ద్వారా విచారణ జరిపింది. అనంతరం మే 3 నుంచి రోజువారీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. మళ్లీ మొదటి నుంచి వాదనలు కొనసాగనున్నాయని ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ తెలిపారు.
అయితే రాజధాని భూములకు సంబంధించిన కేసుపై ఎప్పుడు విచారణకు షెడ్యూల్ ఖరారు చేయాలనే అంశంపై ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ జనరల్, ఇటు రైతుల తరపున వాదించే న్యాయవాదులతో చర్చించారు. గతంలో ఈ కేసు సంబంధించి ఇటు రైతుల నుంచి అటు ప్రభుత్వం నుంచి దాదాపుగా వాదనలు పూర్తయ్యే దశలో అప్పటి చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి బదిలి కావడంతో ఈ కేసులు విచారణ నిలిచిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి వినేందుకు త్రిసభ్య ధర్మాసనం సిద్దమైంది. ఈ కేసు విచారణ రెండు మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది.













